జనవరి 1

జనవరి 1

“యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు” (నెహేమ్యా 8 : 10).

దేవుని సంతోషము ఆయన బిడ్డలందరికి చెందవలసి యున్నది. దినదినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములలో ప్రవేశింపనిచ్చి, దానిని విశ్వాసముతో అంగీకరింతురో వారెల్లరు దేవుని ఆనందమును పొందగలరు. నెహేమ్యా 8 అధ్యాయములో ప్రజలందరు ఏక మనస్సుతోను, ఏక తాత్పర్యముతోను ఆ వాక్యమును నూతనముగా వినుటకై కూడుకొని యుండిరి. దేవుని సేవకులు వాక్యమును భోదించుచుండగా, వారి హృదయములు సంతోషభరితములయ్యెను. “ వారికి బహు సంతోషము పుట్టెను “ (నెహేమ్యా 8 : 17) అని చదువుచున్నాము.

మన మొండితనము, బుద్ధిహీనతల చేత, మన గతించిన జీవితము నిష్ఫలముగాను, అపజయములతో కూడినదిగాను ఉండవచ్చును. అయితే దేవుడు గడచిన మన బ్రతుకులను క్షమించి, మనలను తిరిగి తనయొద్దకు రాబట్టుకోనుటకును, మనకు నూతన ఆనందము – “ యెహోవా యందలి ఆనందమును “ అనుగ్రహించుటకు కూడ ఇచ్ఛయించుచున్నాడు. ఆ ఆనందము మన బలముగా ఉండవలెను. మనము ఆయనవైపు తిరిగిన క్షణమే ప్రారంభమై, ఆయనతో మనము నడచిన కొలది అడుగడుగునకు విస్తరించుచుండు ఆనందమది.